Telangana State Elections | డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు
Telangana State Elections | డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు
సంచలన వ్యఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిగ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మారనున్న రాజకీయ సమీకరణాలుఅప్రమత్తమైన పలు పార్టీల అధినేతలుడిసెంబర్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు
Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగనుందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలో.. పార్లమెంట్ ఎన్నికలో కాదు. స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లోనే నిర్వహించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా చెప్పడంతో ఎన్నికలకు మరింత బలం చేకూరుతుంది . దీంతో రాష్ట్రంలో ఒక్క సారిగా ఎన్నికల సెగ ఎక్కినట్లుగా సర్వత్రా భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రంలో కొత్త సర్పంచ్‌లు వస్తారని మంత్రి చెప్పకనే చెప్పారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని దాదాపు 12,700 పైగా పంచాయతీలలో రాజకీయ సమీకరణాలపై స్థానిక ప్రజలు ద్రుష్టి సారించినట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రావడానికి కూడా బలమైన కారణాలు లేకపోలేవు. ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అయితే ఇన్‌ఛార్జ్‌లతో పంచాయతీల పాలన కొనసాగిస్తుంది. గ్రామాలలో అభివ్రుద్ధి మందగించింది. మౌలిక వసతి సదుపాయాలు తగ్గాయి. గ్రామీణ ప్రజల సంక్షేమంపైనా తీవ్ర ప్రభావం పడింది. అయితే ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే మొట్ట మొదటి పంచాయతీ ఎన్నికలు ఇవే కావడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆసక్తిగా మారాయి. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ముందుస్తు ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్పకనే చెప్పుతున్నారు. బహుశా ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు కుల గణన కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. ఈ కుల గణన ఈ నెల 6 నుంచి ప్రారంభం కాబోతుంది. కులగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలల్లో పోటీ 42 శాతం రిజర్వేషన్లు పాటించాల్సిన పరిస్థితులు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. కుల గణనకు సంబంధించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా పనులలో నిమగ్నమయ్యారు. అ తరుణంలోనే మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పడంతో ఒక్క సారిగా రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని, అన్ని పార్టీలు ఈ ఎన్నికలపైనా ద్రుష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే డిసెంబర్‌లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, బీసీ కులగణనతో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి వంటి పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం కొంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది.
* * *
Leave A Comment